Friday, October 31, 2014

మరఠ్వాడా కీ షేర్నీ

మరఠ్వాడా కీ షేర్నీ
ముంబై: వేదికపైకి యువ ఎమ్మెల్యే, దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే  కుమార్తె పంకజ ముండే(35) ప్రమాణం చేసేందుకు వచ్చినప్పుడు స్టేడియం ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ‘కౌన్ ఆయా? మరాఠ్వాడా కీ షేర్నీ ఆయా(ఎవరొచ్చారు? మరఠ్వాడా సివంగి వచ్చారు)’ అనే నినాదాలతో హోరెత్తింది. ప్రమాణం చేస్తున్నప్పుడు ఆమె మెట్టింటి పేరైన పాల్వేని వదిలేసి ‘పంకజ గోపీనాథ్ ముండే’గానే తన పేరును పేర్కొన్నారు.

సినిమా రివ్యూ: కరెంట్ తీగ

సినిమా రివ్యూ: కరెంట్ తీగ
 నటీనటులు: 
 మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు.
 
 సంగీతం: అచ్చు
 ఫొటోగ్రఫి: సతీష్ ముత్యాల
 నిర్మాత: మంచు విష్ణు
 దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి
 
 ఆకట్టుకునే అంశాలు:
 కామెడీ
 మంచు మనోజ్ ఫెర్ఫార్మెన్స్
 రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లియోన్ గ్లామర్
 ఫైట్స్, ఫోటొగ్రఫి
 క్లైమాక్స్
 
 మైనస్ పాయింట్స్
 రొటిన్ కథ
 
పార్వతీపురంలో గ్రామపెద్ద శివరామరాజు(జగపతిబాబు)కు ముగ్గురు కూతుళ్లు. వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్). ఆ ఊర్లో   వీర్రాజు(సుప్రీత్) అనే వ్యక్తితో శివరామరాజుకు వైరం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు (మంచు మనోజ్) వీఐపీల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే రాజు, కవితలు ప్రేమించుకుంటాడు. రాజుతో ప్రేమను ఇష్టపడని కవిత తండ్రి శివరామరాజు.. తనకు నచ్చిన వ్యక్తితో కూతురు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.
 
దాంతో కవిత, రాజులు లేచిపోవాలని నిర్ణయించుకుని.. ఊర్లో నుంచి పారిపోవడానికి సిద్ధపడుతారు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న వాళ్లిద్దరూ తిరిగి శివరామరాజు దగ్గరకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన రాజు, కవితలను శివరామరాజు ఏంచేశాడు? వీర్రాజుతో శివరామరాజుకు మధ్య ఉన్న వైరం ఏంటి? ఏ కారణంతో రాజుతో కవిత ప్రేమను వ్యతిరేకించాడు? లేచిపోవాలనుకున్న రాజు, కవితలు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇక ఈ కథలో సన్నీ లియోన్, సంపూర్ణేష్ బాబుల పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ’కరెంట్ తీగ’.
 
 ఎప్పటిలాగే హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను వ్యతిరేకించడం లాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సమాజంలో ఆడపిల్లలు పుట్టడం నేరంగా చూడకూడదు అనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని అల్లిన కథలో రాజుగా మంచు మనోజ్.. ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ తో కలిసి రొమాన్స్‌ను పండించాడు. ఓ పాటను పాడటమే కాకుండా, క్యాస్టూమ్స్ డిజైన్, ఫైట్స్ విభాగాల్లో తన మార్కును చూపించాడు.  మరోసారి మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. గతంలో కంటే ఈ చిత్రంలో మనోజ్ కాస్త పుష్టిగా కనిపించాడు. ఈ విషయంలో మనోజ్ జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. 
 
 గ్లామర్‌కే పరిమితి కాకుండా.. నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది.  అతిధి పాత్రలో సన్నీలియోన్ టీచర్‌గా హాట్‌ హాట్‌గా కనిపించించింది. ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహన్ని కలిగించేలా ఉంది.
 
 లెజెండ్‌తో రూట్ మార్చిన జగపతిబాబు.. ఈచిత్రంలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను, కథకు వెన్నెముకగా నిలిచాడు. ఎప్పటిలాగే తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమ పాత్రల పరిధి మేరుకు పర్వాలేదనించారు. 
 
 సాంకేతిక విభాగం:
 ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పిల్లా ఓ పిల్లా, వరికుప్పల యాదగిరి ’పోతే పోని పోరా’, భాస్కర భట్ల ’ఎర్ర ఎర్ర చీర’, అనంత శ్రీరాం రాసిన పదహారేళ్లైనా పాటలు ఆలరించాయి. అచ్చు బ్యాక్ గ్రౌడ్ స్కోర్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే అదనంగా మరికొంత ఫీల్ తెరపై కనిపించేంది.  మంచు మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, ఫోటోగ్రఫి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. 
 
 దర్శకత్వం: 
 మినిమమ్ గ్యారెంటి అనే బ్రాండ్ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. తొలి భాగంలో కథనంలో వేగం మందగించనట్లు కనిపించినా.. సెకండాఫ్‌లో గన్ ఎపిసోడ్, జగపతిబాబు నిద్రలో నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే.. కథలో కొంత వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. 
 
ముగింపు:
కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ‘కరెంట్ తీగ’ బీ, సీ సెంటర్లోని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మనోజ్ కెరీర్‌లో భారీ విజయం చేరినట్టే.

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!
లండన్ :
ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే.. మధ్యలో నేనూ వస్తా అంటూ చిన్న పిల్లలు దూరడం సర్వసాధారణం. అయితే, న్యూకేజిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు లండన్ బార్ లో సెల్ఫీ తీసుకుంటే.. వాళ్ల అనుమతి తీసుకోకుండానే ఓ అతిథి వచ్చి ఆ ఫొటోలో దూరింది. ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ 'దెయ్యం' నిలబడినట్లుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఫొటో.. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) అనే ఇద్దరు కలిసి న్యూ కేజిల్ లో 'గరల్స్ నైట్'ను ఎంజాయ్ చేశారు.  ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకున్న తర్వాత ఈ ఫొటో తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్ చాట్ లో అప్ లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత
నంద్యాల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్ కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాటి మున్సిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. దాంతో నంద్యాల అంతా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను అడిగినా ఎలాంటి సమాధానం రావట్లేదు. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!

అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!
బరేలీ : ఉత్తరప్రదేశ్ లోని బరేలీ వాసులకు అనుకోని పార్టీ దక్కింది. బరేలి సమీపంలోని బడా బైపాస్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ప్రముఖ లిక్కర్ కంపెనీకి చెందిన 'స్ట్రాంగ్' బీరు తీసుకెళ్తున్న లారీ తిరగబడటంతో మొత్తం అందులో ఉన్న బీరు కార్టన్లన్నీ పడిపోయాయి. ఈనోటా, ఆ నోటా ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసింది.

వెంటనే అందరూ జెర్రీ క్యాన్లు, గ్లాసులు, మగ్గులు, జార్లు, చివరకు పాలిథిన్ కవర్లు కూడా పట్టుకుని చేతనైనంత బీరును ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరికొందరు ఔత్సాహికులు అక్కడికక్కడే పొట్టలో పట్టినంత ఎక్కించేశారు. విషయం చుట్టుపక్కల గ్రామస్థులకు కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా గిన్నెలు, చెంబులు పట్టుకుని వచ్చేశారు. దాంతో చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే బైపాస్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ కు, అతడి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లిద్దరినీ ముందు కాపాడి.. ఆ తర్వాత లారీలో ఉన్న మొత్తం సరుకంతటినీ ఖాళీ చేసేశారు. ఇళ్లలో ఉన్న సామాన్లన్నింటినీ తీసుకొచ్చి, వాటిలో నింపేసుకుని వెళ్లారు. కొంతమంది అయితే, బాగున్న సీసాల కార్టన్లను కార్లలో వేసుకుని కూడా వెళ్లిపోయారు. దారిలో వెళ్లేవాళ్లు కూడా ఆగి.. ఏంటా అని చూసి.. తాము కూడా ఓ చెయ్యేసి బీర్లు తెగ లాగించేశారు. లారీ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఓ సైకిల్ అడ్డం రావడంతో అదుపుతప్పి లారీ బోల్తాపడిందని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి చెప్పాడు. చివరకు సీబీగంజ్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య

చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ : చదువుపై అయిష్టత ఓ యువతి ప్రాణాలు తీసింది. తనకు చదువంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలోని శాంతాభవన్ క్యాంపస్ లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం కడప జిల్లా.

చదువుకోవడం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం

కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శనివారం కూడా ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. రామకుప్పం మండలం రామాపురం తండా సమీపంలో గజరాజులు ఘీంకారాలతో హోరెత్తిస్తున్నాయి. వీర్నమల ప్రాంతంలో పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో సమీప గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విద్యుత్ షాకుతో రామాపురం తండా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో గురువారం ఓ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన ఏనుగులు అక్కడే మకాం వేశాయి.  రాత్రంతా గుంపులోని మిగిలిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ అక్కడే ఉండిపోయాయి. ఎలాగైన కిందపడ్డ ఏనుగును తీసుకెళ్లాలని ప్రయత్నించాయి. మరోవైపు మృతి చెందిన ఏనుగును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి

సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని అన్నారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పార్టీ చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని అంతా అంటున్నారని, కానీ సీపీఎం, ఆర్జేడీ లాంటి పార్టీలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోరేమని డిగ్గీ రాజా ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రస్తుతం సాగుతోంది. అది ఈ ఏడాది చివరకు పూర్తవుతుంది. 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని, మౌలానా ఆజాద్ అయిఏత 35 ఏళ్లకే పదవి చేపట్టారని గుర్తు చేశారు. రాహుల్ బాబాకు ఇంతకు మించి మంచి తరుణం దొరకబోదని ఆయన అన్నారు.

సీఎం కుర్చీకి ముప్పు: రేవంత్‌రెడ్డి

సీఎం కుర్చీకి ముప్పు: రేవంత్‌రెడ్డి
తాండూరు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకంలేదని.. 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు (హరీష్‌రావు వైపు) ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లాడారు.

ఏ క్షణంలోనైనా తన ముఖ్యమంత్రి కుర్చీకి ముప్పు ఏర్పడుతోందని భయపడే కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.  తమ పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు కూడా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి బతిమిలాడి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తీగల కృష్ణారెడ్డి వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం
అఫ్జల్‌గంజ్: బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అఫ్జల్‌గంజ్ ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం...అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ  కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈనెల 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న వెంటనే భరణికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ వచ్చింది.

ఆందోళనకు గురైన ఆయన అర్ధరాత్రి వరకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మరుసటి రోజు బెంగళూర్‌లో ఆమె పని చేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా భరణి రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు,మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!
ముంబై : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియో యూట్యూబ్ లో పది లక్షల హిట్లు దాటేసింది. ఆర్- విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్ర శ్రేష్ఠ భారత్' అనే టైటిల్ పెట్టారు. దేశ ప్రజల కోసం దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. ప్రధానమంత్రి ఆలోచనలను, ఆయన దూరదృష్టిని ఈ వీడియో ద్వారా ప్రజలకు అందజేయాలని తాము ప్రయత్నించినట్లు రవీంద్ర సింగ్ చెప్పారు.

రాణీ మాలిక్ రాసిన ఈ పాటకు.. మానెక్, సత్య, అఫ్సర్ సంగీతం అందించారు. ఈ వీడియోకు రాజీవ్ ఖండేల్వాల్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోలో కనిపిస్తారు.

అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది

అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది
కర్నూలు: కర్నూలు నగరంలోని జేఎంజే స్కూల్ లో శనివారం దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాలతో స్కూల్ కి వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్ తన ఆగ్రహన్ని ప్రదర్శించింది. ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలంటూ హుకుం జారీ చేశారు. అందుకు విద్యార్థి ససేమిరా అనటంతో టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బెత్తం తీసుకుని విద్యార్థిని చితక బాదింది. విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు.
దాంతో తల్లిదండ్రులు, వీహెచ్ పీ నేతలతోపాటు కార్యకర్తలు స్కూల్ కు చేరుకుని... క్షమాపణలు చెప్పాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్  చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో తరగతి గదులలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేఎంజే స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

భూమాపై ‘హత్యాయత్నం’ కేసు

భూమాపై ‘హత్యాయత్నం’ కేసు
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్‌లో రసాభాస..
ప్రతిపక్షంపై టీడీపీ సర్కారు మరో కక్షసాధింపు చర్య


నంద్యాల: ప్రతిపక్ష పార్టీని వేధించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని వేచిచూస్తున్న అధికార టీడీపీ సర్కారు.. అందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న స్వల్ప తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై.. హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకూ సిద్ధపడింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది.

కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ శుక్రవారం టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు. వారు వెనుక కుర్చీలోకి వెళ్లాలని టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగానే.. ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్మన్ హెచ్చరించారు. ఇంతలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా శివశంకర్‌ను వెనుక కుర్చీలో కూర్చోవాలని సూచించారు.

పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసిందని చైర్మన్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే చైర్మన్ మరోసారి సమావేశం ముగిసిందని బెల్ కొట్టడమే కాకుండా.. ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని టీడీపీ కౌన్సిలర్లను ఆదేశించారు. దీనికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారితో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.

టీడీపీ వర్గీయులు దాడికి దిగటంతో పరిస్థితి కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా సర్దిచెప్పబోయినా ఫలితంలేకపోయింది. ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మైనార్టీ కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టీడీపీకి చెందిన వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లకూ గాయాలయ్యాయి. చైర్మన్, మునిసిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

అంతకుముందు చైర్‌పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ నంద్యాల చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి భూమాను అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకొని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేనందున ఇంటి వద్దే కాపు కాశారు.

హక్కులను కాలరాస్తున్నారు: భూమా
శాసనసభ్యుని హక్కులను కాలరాస్తున్న మునిసిపల్ చైర్మన్ దేశం సులోచనపై, అధికారులపై శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు

Thursday, October 30, 2014

నటిపై వేధింపుల వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్

నటిపై వేధింపుల వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్
న్యూయార్క్: న్యూయార్క్ వీధుల్లో మహిళలపై వేధింపుల నేపథ్యంతో తీసిన వీడియో ఇంటర్నెట్ లో దూమారం రేపుతోంది. రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియో ఘటన అమెరికా మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా మైనారిటీలు, మహిళ సంఘాలు నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 
 
జీన్స్, టీషర్టు ధరించి మాన్ హట్టన్ వీధుల్లో పది గంటల పాటు నడిచి వెళ్తున్న నటి  శోషానా బి. రాబర్ట్స్ వీడియోను హోలాబ్యాక్ ఛారిటీ కోసం షూట్ చేశారు. ఈ వీడియోలో కొంత మంది యువకులు శోషానాను 'హే బేబీ', హే, బ్యూటిఫుల్ అంటూ వేధించడం లాంటివి షూట్ చేశారు. 
 
పదిగంటల్లో సుమారు 100 మంది యువకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా శోషానా పెద్దగా స్పందించకుండా నవ్వుతో మందలించడం లాంటి సన్నివేశాలు వీడియోలో కనిపిస్తాయి. మంగళవారం యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోను 9.8 లక్షల మంది చూడటం విశేషం. వీడియో చూసిన కొంతమంది ఆన్ లైన్ లో తనపై బెదిరింపులకు పాల్పడినట్టు శోషానా ఫిర్యాదు చేశారు. 
 
ఈ మెయిల్స్ లో కొంత మంది ప్రశంసించగా, మరికొంత మంది చంపుతామని బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా తాను అభద్రతాభావానికి లోనవుతున్నానని.. ఈ సంఘటనల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని  శోషానా వెల్లడించింది. స్వలింగ సంపర్కులు, నల్లజాతివారి నుంచి ఎక్కువగా వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపింది.

'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల

'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల
ముంబై: తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ లను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి అంధేరి కోర్టుకు తీసుకెళ్లామని, అదే రోజు వారు బెయిల్ పై విడుదలయ్యారని అంబోలి పోలీసుల తెలిపారు. ఈ కేసులో తగిన ఆధారాల కోసం సేకరిస్తున్నామని పోలీసు ఇన్స్ పెక్టర్ వెల్లడించారు. 
 
తనను బెదిరించడమే కాకుండా,  వేధింపులకు కూడా పాల్పడుతున్నారని సనా, ఇస్మాయిల్ లపై ఓ మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..  ఓ జిమ్ వద్ద దాడి చేశారని సనా, ఇస్మాయిల్ లపై సోహిల్ ఖాన్ అనే నటుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ సరసన కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య చిత్రంలో సనా ఖాన్ నటించింది.

టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్వీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన సిద్ధార్ధ్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి  చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు.
 
ఈ ప్రమాదంలో విద్యార్థి విజయ్ నాగేంద్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కార్ల రేసింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఆ విషయాన్ని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం

మోడీ సర్కార్ సంచలన నిర్ణయంవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన సిక్కుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను చెల్లించాలని మోడీ సర్కార్ ఆదేశాలు జారీ చేయనుంది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ద్వారా 3,325 మంది కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 
 
గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయడంలో విఫలమైంది

వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు

వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: వీజీటిఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని రద్దు చేసి, దాని స్థానంలో రాజధాని అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి మండలి ఉపసంఘం ప్రకటించింది. ఏపి రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ రోజు ఇక్కడ సమావేశమైంది.  భూసేకరణకు విధి విధానాలను ఖరారు చేసింది. సమావేశం ముగిసిన తరువాత మంత్రి పత్తిపాటి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. 17 గ్రామాలలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో మూడు గ్రామాలలో మాత్రమే భూమి సేకరించనున్నట్లు తెలిపారు. కృష్ణా నదికి దక్షిణ భాగాన ఈ గ్రామాలు వస్తాయని చెప్పారు. గ్రామంలో ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోవడంలేదన్నారు. ఉన్న గ్రామాలు ఉన్నట్లు ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని తరలించం అన్నారు. ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూమిని కూడా సేకరిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తుంటే వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

దాదాపు 21 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కిందకు వస్తారని తెలిపారు. సూత్రప్రాయంగా రైతులతో మాట్లాడితే సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ కు రైతులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అందరినీ ఒప్పించి భూమి సేకరిస్తామన్నారు. భూమి సేకరించిన తరువాత  ఎకరాకు 25వేల రూపాయల చొప్పున పది సంవత్సరాల పాటు రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఒక్కో ఎకరం అభివృద్ధికి 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేసిన తరువాత రైతుకు ఎకరాకు వెయ్యి గజాల భూమి ఇస్తామన్నారు. ఆ తరువాత రైతులకు అనుకూలంగా ఉన్నచోట లాటరీ ద్వారా భూమి ఇస్తామన్నారు. 9 నెలల్లో ఆరు సెక్టార్లలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఒక్కో సెక్టారులో 5వేల ఎకరాల భూమి ఉంటుందని తెలిపారు.

మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో ఆరుగురు మంత్రులతోపాటు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన
న్యూయార్క్: తాను స్వలింగ సంపర్కుడినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో 'నేను స్వలింగ సంపర్కుడి' నని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని కుక్ వెల్లడించారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఎప్పుడూ ఖండించలేదని,  బహిరంగంగా ప్రకటన చేయలేదన్నారు. ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తాను స్వలింగ సంపర్కుడినన్న విషయం తెలుసన్నారు.
 
స్వలింగ సంపర్కుడినని చెప్పడం అంత సులభం కాలేదని, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందని ఈ విషయాన్ని బహిరంగపరిచానని వివరణ ఇచ్చారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు. ప్రజలందరికి సమాన హోదా ఉండేందుకు పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా ఉత్తమ సీఈఓగా గుర్తింపు పొందడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని టిమ్ కుక్ అన్నారు.

'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'

'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అని శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ క్రికెట్ రంగంపై ఎంఎస్ ధోని ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన తెలిపారు. 
 
ధోని గొప్ప క్రికెటర్, భారత జట్టును ముందుకు నడిపించడంలో ఆయన వ్యూహాలు అమోఘమన్నారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలతోపాటు అన్ని ప్రధాన టోర్నిల్లో భారత్ కు విజయాన్ని అందించారని శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ రంగానికి ఇండియా సిమెంట్స్ ఎనలేని కృషి చేసిందని, ఎందరో క్రికెటర్ల భవిష్యత్ ను తీర్చిదిద్దందని శ్రీనివాసన్ తెలిపారు. 

Wednesday, October 29, 2014

బాలీవుడ్ లోకి అబ్ రామ్ ఎంట్రీ అలా జరిగింది: షారుక్

బాలీవుడ్ లోకి అబ్ రామ్ ఎంట్రీ అలా జరిగింది: షారుక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అబ్ రామ్ ఎంట్రీపై షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపీ న్యూఇయర్ విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరమీద కనిపించడమే తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని షారుక్ అన్నారు. అబ్ రామ్ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించిన దర్శకురాలు ఫరాఖాన్ కే ఆ క్రెడిట్ దక్కుంతుందని షారుక్ తెలిపారు. 
 
షూటింగ్ లో బిజీగా ఉండటం ద్వారా తాను ఎక్కువగా అబ్ రామ్ తో గడపలేకపోయాను. అయితే ఓ రోజు అబ్ రామ్ స్టూడియోకు వచ్చాడు. డాన్స్ స్టేజ్ పై కూర్చుని వాడితో డాన్స్ చేశాను. అబ్ రామ్ తో డాన్స్ చేయడం చూసిన ఫరా.. షూటింగ్ చేయాలా అని తనను అడిగింది. వెంటనే నేను ఓకే అని చెప్పడంతో ఆ సన్నివేశాన్ని ఫరా షూట్ చేసింది. అలా అబ్ రామ్ అనుకోకుండా బాలీవుడ్ తెరమీద ఎంట్రీ ఇచ్చాడు అని షారుక్ ఐఏఎన్ఎస్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హ్యపీ న్యూ ఇయర్ చిత్రంలో ఎండ్ టైటిల్స్ లో షారుక్ తో కలిసి అబ్ రామ్ కనిపిస్తాడు. సర్రోగసి ద్వారా ఇటీవల షారుక్ దంపతులు అబ్ రామ్ కు జన్మనిచ్చారు. అబ్ రామ్ జననానికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే అంశం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.

జంటగా...

జంటగా...
 ‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్, అవికా గోర్ మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అంజిరెడ్డి, రూపేష్ డి.గోవిల్, బెక్కెం వేణుగోపాల్, రాజశేర్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అవిక, రాజ్ తరుణ్‌ల మధ్య కెమిస్ట్రీని మరోసారి బ్రహ్మాండంగా ఆవిష్కరించే చిత్రమిది. కథ కోసమే ఎనిమిది నెలల సమయం కేటాయించాం. ప్రసన్నకుమార్ సంభాషణలు నవ్విస్తాయి. శేఖర్‌చంద్ర బాణీలు అలరిస్తాయి. అందరూ చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు. మళ్లీ కలిసి నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్

రఫ్ ఆడించే యాక్షన్

రఫ్ ఆడించే యాక్షన్
 ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరం నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆది నటిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడులైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలందించారు. నవంబర్ 2న పాటల వేడుకను ఘనంగా జరుపనున్నాం’’ అని తెలిపారు. నటునిగా ఆదిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమా... అతని కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కెమెరా: సెంథిల్ కుమార్, అరుణ్‌కుమార్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్.

ఆస్తి తగాదాపై కార్తీక్ ఫిర్యాదు

ఆస్తి తగాదాపై కార్తీక్ ఫిర్యాదు
 టీనగర్: ఆస్తి తగాదాకు సంబంధించి నటుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెరైక్టర్ భారతీరాజా ‘అలైగళ్ ఓయ్‌వదిల్లై’ అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన నటుడు కార్తీక్ అనేక చిత్రాల్లో నటించారు. ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం చిత్ర నటుడిగా కొనసాగుతున్నారు. కార్తీక్‌కు అతని కుటుంబీకులకు మధ్య ఆళ్వారుపేటలోగల ఇల్లు, ఇతర స్థలాలకు సంబంధించి కొంతకాలంగా తగాదాలు వున్నాయి. ఈ కారణంగా కొన్ని రోజుల క్రితం కార్తీక్ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన విడిగా వుంటున్నట్లు సమాచారం. ఈ క్రమం లో కార్తీక్ మంగళవారం రాత్రి తేనాంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒక ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఇందులో ఆస్తి తగాదా గురించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఆస్తి తగాదాకు సంబంధించి కార్తీక్ అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరుపనున్నట్లు తెలిపారు.

సాహసానికి సై!

సాహసానికి సై!
ఇప్పటివరకూ అభినయం, అందం... ఈ రెండిటికే ప్రాధాన్యమిస్తూ దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ల దృష్టి ఇప్పుడు సాహసాల మీదకు మళ్లింది. ఇప్పటికే అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలు నేర్చుకొని తెరపై వీరత్వాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. తమన్నా కూడా... ‘బాహుబలి’ కోసం యుద్ధ విద్యలు అభ్యసించారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. ఆమె కూడా యాక్షన్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోనున్నారట. తమిళంలో ‘జయం’రవితో ఆమె నటిస్తున్న ‘తని ఒరువన్’ సినిమాలో నయన డైనమిక్ పోలీస్ అధికారిగా నటిస్తు న్నారు. ఈ కసరత్తులన్నీ ఆ పాత్ర కోసమే. అంతేకాక... మాజీ పోలీస్ అధికారి కిరణ్‌బేడీతో సహా పలువురు మహిళా పోలీసుల్ని స్టడీ చేస్తున్నారట నయన.

మనోజ్ సాహసాలు ఈ చిత్రానికి హైలైట్ : మోహన్‌బాబు

మనోజ్ సాహసాలు ఈ చిత్రానికి హైలైట్ : మోహన్‌బాబు
‘‘హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చూస్తే బాధేసింది. అందుకే ఈ నెల 17న విడుదల చేయాల్సిన ‘కరెంట్ తీగ’ను 31వ తేదీకి వాయిదా వేశాం’’ అని నటుడు డా.మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు స్వరాలందించారు. ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో బుధవారం జరిగింది.

 మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘నిజానికి వేల సీడీలు అమ్ముడైతే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతారు. అమ్ముడు కాకపోయినా ఇటీవల వేడుకలు జరుపుతున్నారు అది వేరే విషయం. కానీ.. మా పాటలు నిజంగా జనాదరణ పొందాయి కాబట్టే.. ఈ వేడుక చేశాం. విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చేసిన నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్నీ అద్భుతంగా తీశారు. మనోజ్ పదేళ్లలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే... ‘కరెంట్ తీగ’ మరో ఎత్తు. అతని సాహసాలే ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు.

  హుదూద్ తుపాను బాధితులు పడే ఇబ్బందులను అందరూ స్వయంగా వెళ్లి చూడాలని, వీలైనంత సహాయం చేయాలని మనోజ్ కోరారు. హుదూద్ బాధితులకు సంఘీభావంగా రామజోగయ్యశాస్త్రి రచన, అచ్చు స్వరాలతో రూపొందించిన ‘యూనిటీ..’ అనే పాటను ఈ వేదికపై వినిపించారు. ఈ వేడుకలో నాగేశ్వరరెడ్డి, అచ్చు, రచయిత కిశోర్ తిరుమల బృందం, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి, సంపూర్ణేష్ తదితరులు పాల్గొన్నారు.

వాళ్లంటే నా కిష్టం

వాళ్లంటే నా కిష్టం
 ప్రేమ, అభిమానం, ఇష్టం ఈ మూడు ఎప్పుడు, ఎలా? ఎవరిపై కలుగుతాయో  ఎవరికి తెలియదు. అందరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఇష్టపడతారు కూడా. అందుకు తగిన కారణాలు కూడా ఉంటాయి. ఇక కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన నటుల్లో శింబు ముందు వరుసలో ఉంటారు. అలాంటి నటుడు మనసుని ఆకట్టుకున్న వారి గురించి శింబు తన మనోగతాన్ని మన ముందుంచారు. అదేంటో ఆయన మాటల్లోనే...

 దేవతామూర్తుల్లో కాళిమాతను పూజిస్తాను. కారణం ఆ దేవత కోపం, ఆక్రోశం నా మనస్సును కదిలిస్తాయి. ఇక మా అమ్మ ఉషారాజేంద్రన్ అంటే చాలా చాలా ఇష్టం. తన మనసులోని ప్రతి విషయాన్ని దాచకుండా నాతో పంచుకుంటారు. నా చెల్లెలి విషయాని కొస్తే నా చిత్రాలకు తొలి విమర్శకురాలు తనే. కొన్ని చిత్రాలను మెచ్చుకొంది. మరి కొన్ని చిత్రాలపై విమర్శల వర్షం గుప్పించింది. నా తమ్ముడు కురళరసన్, తను తరచు గొడవపడుతుంటాడు. అయితే నాతో గొడవ పడిన సందర్భాలు లేవు. నా చెల్లలంటే నాకు చాలా ప్రేమ.

 ఇప్పుడామె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయింది. ఇక నేను అమితంగా ప్రేమించే స్త్రీమూర్తి లతారజనీకాంత్. ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదనే చెప్పాలి. వారి ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లు చదువుకున్నాను. ఆ సమయంలో ఎన్నో మంచి మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మరో విషయం ఏమిటంటే నాలోని నటన ప్రతిభ బహిర్గతం కావడానికి  లతా రజనీకాంత్ కూడా కారణం. ఇక నన్ను బాగు ఆకట్టుకున్న స్త్రీమూర్తి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఆమె ఆత్మవిశ్వాసం స్ఫూర్తి నిచ్చింది.   ఆమె అవసరమైన విషయాలను మాత్రమే మాట్లాడుతారు. ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది.

 ఇక మీరు ఆశించిన విషయాలను కూడా చెబుతాను. నటి త్రిష నాకు బాల్య స్నేహితురాలు. అలై చిత్రంలో తొలిసారిగా కలిసి నటించాము. ఆ తర్వాత విన్నై తండి వరువాయా చిత్రంలో నటించాము. ఈ చిత్రంలో మా మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని ప్రశంసించారు. మేము కలిసి ఎక్కువగా చిత్రాలు చేయకపోయినా తరచు కలుసుకుంటాం. పార్టీలకు వెళుతుంటాం. నయనతార, హన్సికల గురించి ఏమి చెప్పమంటారు? వాళ్లపై నా ప్రేమ నిజమైనది అయితే దాన్ని వారు అర్థం చేసుకోకుండా మతం మార్చినంత సులభంగా మారిపోయారు అంటు నటుడు శింబు తన మనసులోని భావాలను వెల్లడించారు.

కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి

కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి
 ‘‘సినిమా విడుదలకు ముందు రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురు చూశా. ప్రేక్షకుల స్పందన తెలిశాక హమ్మయ్య అనుకున్నా’’ అని దర్శకుడు చందు మొండేటి అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అటు ప్రేక్షకుల్ని ఇటు సినీ పరిశ్రమ వారిని చిత్రం ఆకట్టుకుంటోందంటూ చందు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

  మాది కొవ్వూరు. కానీ, పెరిగిందంతా చెన్నయ్‌లోనే. బీటెక్ చదివాను. సినిమాలంటే ఇష్టమే కానీ.. డెరైక్టర్ అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అయితే, సినిమా పరిశ్రమలోనే స్థిరపడాలనుకున్నాను. లైట్‌మేన్‌గా చేరితే.. కెమెరామేన్ కావొచ్చనీ, కథలు రాసుకుంటే రచయితగా స్థిరపడొచ్చనీ అనుకున్నాను. నేను కథ చెప్పే విధానం చూసి, నా స్నేహితులు ‘నీలో డెరైక్టర్ లక్షణాలున్నాయి’ అనేవారు. కానీ, పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఓసారి హైదరాబాద్‌లో 10, 15 రోజులుందామని వచ్చాను. ఆ సమయంలోనే సుకుమార్‌గారి ‘ఆర్య’ విడుదలైంది. ‘కొత్త పాయింట్‌తో తీశాడు’ అంటూ ఎక్కడ చూసినా సుకుమార్‌గారి గురించే! కొత్తగా తీస్తే, దర్శకుడికి ఇంత పేరొస్తుందా అనిపించింది. అప్పటికే నా దగ్గర కొత్త పాయింట్స్ ఉండటంతో డెరైక్టర్ అవుదామనుకున్నా.

  ఇక్కడ కొంతమంది స్నేహితుల ద్వారా సుధీర్ వర్మ, నిఖిల్‌లతో పరిచయం ఏర్పడింది. అప్పుడు
 నిఖిల్ కీలక పాత్రలో ఓ సినిమా ఆరంభమైతే, నేనూ, సుధీర్ దర్శకత్వ శాఖలో చేరాం. ఆ చిత్రం ఆగినా, మా స్నేహం మాత్రం కొనసాగుతోంది. ఆ తర్వాత పరశురామ్ దగ్గర ‘యువత’కి చేశాను. అలాగే రెండు, మూడు సినిమాలకు రచయితగా వ్యవహరించాను. అప్పుడు ‘కార్తికేయ’ కథతో దర్శకుడు కావాలనుకున్నాను. ‘స్వామి రారా’వంటి వినూత్న కథాంశంతో సుధీర్ హిట్ సాధించడంతో బలమైన కథలకు ఆదరణ ఉంటుందనే నా నమ్మకం ఇంకా పెరిగింది. నిఖిల్ ‘కార్తికేయ’ కథ వినడం, తనకు నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం.

  ‘కార్తికేయ’ విడుదల తర్వాత ఎంతోమంది ప్రముఖులు ఫోన్ చేసి, అభినందించారు. అల్లు అర్జున్, వినాయక్‌గారు, సుకుమార్‌గారు, సుప్రియ, అశ్వనీదత్‌గారి కుమార్తె ప్రియాంకా దత్ ఫోన్ చేసి, అభినందించారు. ఏవైనా కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు. నా దగ్గర నాలుగైదు కథలున్నాయి. వాటిలో ఒకటి నాగార్జునగారికి సరిగ్గా సరిపోతుంది. నేను ఆయన అభిమానిని. అందుకే, ఆయనకు తగ్గ కథ రెడీ చేశాను.

  ఇకపై డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే తీస్తా. ‘కార్తికేయ’ విడుదలయ్యాక, ఆదరణ బాగుండడంతో ఇంకా థియేటర్లు పెంచాం. ఈ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో నా తదుపరి చిత్రాలను కూడా వినూత్న కథాంశాలతోనే చేస్తా.

ఐటమ్ సాంగ్ ఏంటి?

ఐటమ్ సాంగ్  ఏంటి?
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌కంటూ ప్రత్యేకంగా కొందరు భామలుండేవారు. అయితే ఇప్పుడు ఆ భామలకు దీటుగా కథానాయికలే అంగాంగ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ఇంతకుముందు ఈ ట్రెండ్ బాలీవుడ్‌లోనే ఉండేది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ అంతటా విస్తరించేసింది. ఇలాంటి పాటలకిప్పుడు అరకోటి వరకు ఈ ముద్దుగుమ్మలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లు శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ లాంటి వారు సింగిల్ సాంగ్‌కు సై అంటున్నారు. తాజాగా జాబితాలో చెన్నై చిన్నది త్రిష చేరిందనే ప్రచారం హోరెత్తింది. నటిగా దశాబ్దం దాటిన ఈ మూడు పదుల భామ రేస్‌లో కాస్త వెనుకబడ్డారు.

 అయినా అవకాశాలు మాత్రం అస్సలు లేకుండా పోలేదు. లేటెస్ట్‌గా కన్నడ చిత్ర రంగప్రవేశం చేసిన త్రిష తెలుగు చిత్రం దూకుడు రీమేక్‌లో పునిత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేశారు. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకక్కడ చిత్ర పరిశ్రమలో క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రే జ్‌ను అక్కడ దర్శక నిర్మాతలు మరో విధంగా వాడుకోవాలని చూస్తున్నారని సమాచారం. అదేనండి ఐటమ్ సాంగ్స్‌తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. తాజాగా నాన్‌ఈ ఫేమ్ సుదీప్ కన్నడంలో నటిస్తున్న తాజా చిత్రంలో త్రిషకు ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.

 ఇది తెలుగులో పవన్ కల్యాణ్  నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో రచితారామ్, హరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో ముంతాజ్ నటించిన ఐటమ్ సాంగ్‌ను కన్నడంలో త్రిష నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియూ ప్రచారం. ఇదే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలోను త్రిష సింగిల్‌సాంగ్‌కు చిందేయనున్నారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని  త్రిష తల్లి ఉమ కొట్టిపారేశారు. అసలు త్రిషను ఐటమ్‌సాంగ్ చెయ్యమని తమ నెవరూ అడగలేదని ఆమె స్పష్టం చేశారు. 

రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం

రజనీ, కమల్‌కు కర్ణాటక ఆహ్వానం
సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వివరాల్లోకి వెళితే కన్నడ కంఠీరవగా ఖ్యాతి ఘడించిన దివంగత నటుడు రాజ్‌కుమార్ స్మారకార్థం కర్ణాటకలోని కంఠీరవ స్టూడియో ఆవరణాల్లోని రెండున్నర ఎకరాల్లో పెద్ద మండపాన్ని నిర్మించింది. రాజ్‌కుమార్ పుణ్యస్థలం పేరుతో నెలకొల్పిన ఈ ఆవరణలో800 మంది కూర్చుని తిలకించే విధంగా అందమైన ప్రాంగణాన్ని నిర్మించారు. చిన్న స్విమింగ్ పూల్‌తోపాటు సుందరమయిన పార్క్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అరుదైన రాజ్‌కుమార్ పాటలతో కూడిన ప్రదర్శన హాలును నెలకొల్పారు.

 మణిమండపంలో రాజ్‌కుమార్  శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజ్‌కుమార్ పుణ్యస్థలం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెల (నవంబర్) 29న భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ప్రారంభించనున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రజనీకాంత్, కమల్‌హాసన్‌ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను ఆహ్వానించింది. రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన నటి సరోజినీదేవి, షావుకారు జానకి తదితరులకు ఆహ్వానం పంపినట్లు రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ వెల్లడించారు

డబ్బు నల్లగా జారుకునేదిలా..

డబ్బు నల్లగా జారుకునేదిలా..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్: వ్యక్తులైనా ,సంస్థలైనా నల్ల ధనాన్ని విదేశాలకు పంపించడానికి ఎంచుకునే ఏకైక మార్గం కార్పొరేట్ నిర్మాణ వ్యవస్థ. లెక్కకు మిక్కిలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నమోదు చేయడం, వాటికి అంచెలంచెలుగా సబ్సిడరీలను ఏర్పాటు చేయటం, లావాదేవీలను సంస్థల మధ్య గొలుసుకట్టుగా పేర్చటం, విదేశాల్లో సమాంతర వ్యవస్థలు నెలకొల్పడం, బ్యాంకుల ద్వారా దర్జాగా డ్రా చేసుకోవడం..ఇదీ స్థూలంగా నల్ల కుబేరుల సంపద సృష్టి రహస్యం.నల్ల ధనం మూలాల్లోకి వెళితే..

దేశీయ కంపెనీలు ఒక ఏడాదిలో  ఆర్జించిన లాభాలపై 30 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. సర్‌ఛార్జీ, విద్యా సెస్సులతో కలుపుకుంటే ఇది 33.9 శాతానికి పెరుగుతుంది. లాభరాశిలో మూడొం తులు పన్ను చెల్లించాల్సి రావడం తలకు మించిన భారం కావడంతో పన్ను ఎగవేత దారిని ఎంచుకోవడమే నల్లధనం సృష్టికి ప్రధాన కారణం అవుతోంది. సాధారణంగా వ్యాపార లావాదేవీలను వాస్తవ విలువ కన్నా తగ్గించికానీ,అసలే నమోదు చేయకపోవడం వల్లకానీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుతుంటాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, జ్యువెలరీ వ్యాపారులు, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఎన్‌జీవోలు, విదేశీ వాణిజ్యం చేసే సంస్థలు ప్రధానంగా పన్ను ఎగవేత మార్గాలను ఎంచుకుంటారనీ 2012లో నల్ల ధనంపై  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొంది.  ప్రధానంగా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికల్లో    కంపెనీలు చేసే తారుమారు తతంగం కథా
కమామీషు ఇదీ..

విక్రయాలు, రాబడులు:   పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా  పేరుగాంచిన మారిషస్, కేమాన్ ఐలాండ్, హాంకాంగ్, వర్జిన్ ఐలాండ్ లాంటి దేశాల్లో  అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి విక్రయాలను అక్కడికి మళ్లించటం, షెల్ కంపెనీల ద్వారా  డమ్మీ లావాదేవీలు నెరపడం, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కంపెనీలను (హెచ్‌యూఎఫ్) ఏర్పాటు చేసి లావాదేవీలను నెరపడం ద్వారా నల్లధనం పేరుకుపోతోంది. విదేశీ సంస్థలకు మార్కెటింగ్ వ్యయాల రూపంలో, ప్రకటనలు, కమిషన్ రూపంలో దేశీ సంస్థలు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తాయి. ఇదే సొమ్ము  నాన్ టాక్సబుల్ రిసీట్స్ (విరాళాలు, ట్రస్టులు, లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలలకు పంపించే డబ్బు) ద్వారా మళ్లీ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. లేదా విదేశాల్లోనే  బ్యాంకు ఖాతాల్లో ఉండిపోతోంది.

మూలధనం:  కంపెనీలు జారీచేసే షేర్లకు దరఖాస్తుచేసే డబ్బు, షేర్ల కోసం అధిక ప్రీమియంగా చెల్లించే మొత్తం,  విదేశీ సంస్థలు ద్వారా పోగైన షేర్ క్యాపిటల్, నకిలీ బహుమానాలు, బోగస్ మూలధన లాభాలు,  నకిలీ ఆస్తులను పెంచడం ద్వారా నల్లధనం దర్జాగా మళ్లీ ఖాతాల్లోకి వస్తోంది.
 
ఇన్వెస్ట్‌మెంట్ స్కీంలు...
కొంత మంది వ్యక్తులు ఒక గ్రూప్‌గా కలసి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్  స్కీంలను ప్రవేశపెడతారు. ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడులకు  అధిక రాబడులిస్తామని ఆశ పెడతారు. తమ బ్యాంకు ఖాతాలో నగదు  జమ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇన్వెస్టర్‌కు వచ్చే ప్రతిఫలానికి భరోసాగా పోస్ట్ డేటెడ్ చెక్కును జారీ చేస్తారు. అనంతరం బ్యాంకులోని నగదును గ్రూప్ సభ్యులు తమ తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. ఈ ధనాన్ని విదేశాల్లో తాము ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాకు వైర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మళ్లిస్తారు. అక్కడి నుండి మరో దేశంలోని మరో ఖాతాకి మళ్లిస్తూ నెట్‌వర్క్‌ను విస్తృత పరుస్తారు.  విదేశాల్లోని బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రపంచంలో ఎక్కడైనా విని యోగించే  క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డులతో ఇండియాలోనే దర్జాగా డబ్బును డ్రా చేసుకుంటారు.
 
స్మర్ఫింగ్..
బ్యాంకుల కళ్లు కప్పి ఖాతాల్లో డబ్బు దాచుకునే ప్రక్రియనే ‘స్మర్ఫింగ్’ అంటారు. బ్యాంకు ఖాతాలను నిరంతరం పర్యవేక్షించే అధికారులు నగదు డిపాజిట్, విత్ డ్రాయల్ లావాదేవీలకు ఒక పరిమితి పెట్టుకుంటారు. ఉదాహరణకు రూ. పది లక్షలు ఆపైన డిపాజిట్ కానీ విత్ డ్రాయల్ కానీ అయిన ఖాతాలను అబ్జర్వేషన్‌లో ఉంచుతుంటారు. అయితే స్మర్ఫింగ్ చేసే నల్ల కుబేరులు రూ. పది లక్షల కన్నా తక్కువ డిపాజిట్ చేసి బ్యాంకు దృష్టి నుంచి తప్పించుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని విదేశాల్లోని తమ బ్యాంకు ఖాతాలకు వైర్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
 
హవాలా మార్గంలో...
ఎక్స్ అనే ఓ వ్యక్తి ఇండియలో అనైతిక మార్గాల ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడనుకోండి. దీన్ని విదేశాలకు తరలించేందుకు ‘హవాలా’ మార్గాన్ని ఎంచుకుంటారు. స్థానిక హవాలా ఆపరేటర్ కొంత కమిషన్ తీసుకొని ఈ రూ. 10 కోట్లను విదేశాల్లో ఎక్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తాడు. విదేశాల్లో ఎక్స్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇండియాలోని ఎక్స్ కంపెనీలో షేర్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. ఇండియాలోని ఎక్స్ కంపెనీ విదేశీ ఎక్స్ సంస్థకు డివిడెండ్ రూపంలో భారీ మొత్తం చెల్లిస్తుంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు ఇవ్వడం ద్వారా బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఎక్స్ తన ఆదాయ పన్ను రిటర్న్‌లో పొందుపరస్తాడు.

చివరి మ్యాచ్ ఆడానేమో!

చివరి మ్యాచ్ ఆడానేమో!
టి20 ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందా..! శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కనీసం బంతిని ముట్టుకోవడానికి భయపడి చాలా వృథా చేశాడు. అప్పటి నుంచి మళ్లీ అతను భారత్‌కు ఆడలేదు. అయితే భవిష్యత్‌లోనూ అతను ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని యువీ కూడా గుర్తించాడు. భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశానేమోనని అంటున్నాడు.

 మొహాలీ: మూడున్నర నెలలు గడిస్తే మళ్లీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. 2011లో భారత్ ఈ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన యువరాజ్ ఇప్పుడు కనీసం జట్టులోకి వస్తాడనే ఆశతో కూడా లేడు. గత మూడేళ్లలో ఎన్నో మార్పులు. క్యాన్సర్ బారిన పడ్డ యువరాజ్... తిరిగి కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ పూర్వపు ఆట మాత్రం తిరిగి రాలేదు. అయినా దేశవాళీ మ్యాచ్‌లు, ఐపీఎల్ ద్వారా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

వివిధ అంశాలపై యువరాజ్ చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే...
 ప్రయత్నిస్తూనే ఉంటా: భారత్ తరఫున నా చివరి మ్యాచ్ ఆడేశానేమో. ప్రస్తుతం ఉన్న పోటీలో మళ్లీ జాతీయ జట్టులోకి రావడం సులభం కాదు. అయితే నా ప్రయత్నం మానుకోను. గతంలో నేను చాలా లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని చేరాను. ఎప్పుడూ ఓ లక్ష్యంతోనే ఆడుతూ ఉండాలి. లేకపోతే జీవితం నిరాశలోకి వెళుతుంది. ప్రస్తుతం కూడా నా లక్ష్యం భారత్‌కు మళ్లీ ఆడటమే. ప్రయత్నాలను మాత్రం మానుకోను.

 శరీరం మారింది: గత ప్రపంచకప్ తర్వాత నేను క్యాన్సర్ వల్ల జీవితం కోసం పోరాడాను. ఆ సమయంలో మళ్లీ క్రికెట్ ఆడతానని అనుకోలేదు. కానీ తిరిగి ఆడగలిగాను. అయితే నా పూర్వపు స్థాయిలో ఆడలేకపోయాననేది వాస్తవం. 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. నిరంతరం ఫిట్‌గా ఉండటం కష్టం. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక నా శరీరం చాలా మారింది. ప్రణాళిక ప్రకారం కష్టపడటం, ఆశావహంగా ఆలోచించడం ముఖ్యం. వీటితోనే సానుకూల దృక్పథంతో ముందుకు వెళతాను.

 అప్పటికంటే ఫిట్‌గానే: 2011 ప్రపంచకప్ నాటితో పోలిస్తే ఇప్పుడు నేను మంచి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాను. ఒక ఊపిరితిత్తితో ఆడటం, రెండింటితో ఆడటంలో తేడా ఉంది కదా. వేరే వాళ్ల నమ్మకాలతో అంచనాలతో నాకు పని లేదు. నా మీద నాకు నమ్మకం ఉండాలి. అది నాలో ఎప్పుడూ ఉంది.

 అకాడమీల ఏర్పాటు: దేశంలో యువ క్రికెటర్లకు మెరుగైన సౌకర్యాలు ఉండాలనేది నా అభిప్రాయం. నా అదృష్టం కొద్దీ మా నాన్న దగ్గర నేను శిక్షణ పొందా. కానీ చాలా మంది కుర్రాళ్లు సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నారు. నైపుణ్యం ఉండి కూడా అవకాశాలు లేని కుర్రాళ్లను నా అకాడమీల ద్వారా వెలుగులోకి తేవాలనేది ప్రధాన ఉద్దేశం.

 నైట్ పార్టీలు, విమర్శలు: సాధారణంగా అభిమానులు పుకార్లను ఇష్టపడతారు. అందుకే నెగెటివ్ వార్తల కోసం మీడియా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే మనం చేసే చాలా మంచి విషయాలను పట్టించుకోరు. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారనే ఆందోళన నాకు ఎప్పుడూ కలగలేదు. ముఖ్యంగా క్యాన్సర్ నుంచి తేరుకున్నాక నేను చాలా కార్యక్రమాలు చేపట్టాను. వీటి గురించి ప్రచారం అవసరం లేదు. అవసరం ఉన్నవారికి సేవ దొరికితే చాలు.

 జహీర్, భజ్జీ, సెహ్వాగ్ అందరూ ఒకే పడవలో:
 అవును. మేం అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. భారత్‌కు ఆడినప్పటి సంగతుల గురించి మేం కలిసిన ప్రతిసారీ మాట్లాడుకుంటున్నాం. మేం అందరం కూడా ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మేం ఆటను ప్రేమిస్తాం.

 ప్రపంచకప్ అవకాశాలు: జట్టులోకి రావడం అనేది నా చేతుల్లో ఎప్పుడూ లేదు. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయడానికి ముందు దేశవాళీలో పెద్దగా మ్యాచ్‌లు కూడా లేవు. కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం. రంజీట్రోఫీ గురించి ప్రస్తుతం ఆలోచిస్తున్నాను.

 ఇది నాకు రెండో జీవితం: క్యాన్సర్ నుంచి కోలుకుని ఇలా ఉండటం... కచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చిన రెండో జీవితం ఇది. తిరిగి క్రికెట్ ఆడటానికే ఈ జీవితం లభించిందా? లేక క్యాన్సర్ పేషంట్లలో ధైర్యం పెంచడానికి లభించిందా? అనేది తెలియదు. ఏమైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు సాగడం, క్రికెట్ ఆడటం, సేవా కార్యక్రమాలు చేయడం కొనసాగిస్తాను.

 2011 ప్రపంచకప్ నాటితో పోలిస్తే ఇప్పుడు నేను మంచి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాను. ఒక ఊపిరితిత్తితో ఆడటం, రెండింటితో ఆడటంలో తేడా ఉంది కదా. వేరే వాళ్ల నమ్మకాలతో అంచనాలతో నాకు పని లేదు. నా మీద నాకు నమ్మకం ఉండాలి. అది నాలో ఎప్పుడూ ఉంది.

కన్నబిడ్డల్లా చూసుకుంటాం..

కన్నబిడ్డల్లా చూసుకుంటాం..వీడియోకి క్లిక్ చేయండి
పొట్ట చేతపట్టుకుని వచ్చినోళ్లంతా మా బిడ్డలే: కేసీఆర్
చంద్రబాబు ఓ దగా కోరు.. అబద్ధాల కోరు
సీమాంధ్రులను నిండా మోసం చేస్తున్నడు
టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు తీగల, తల సాని, ఎమ్మెల్సీ గంగాధర్

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు బతకడానికి వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నిరుపేదలను సైతం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేస్తుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ దగాకోరని, ఆయన చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. బాబును నమ్మితే సున్నం పెడతాడే కానీ అన్నం పెట్టడని విమర్శించారు. హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేటలో బుధవారం నిర్వహించిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
 
 హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమ
 
 దేశం గర్వపడే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతర్జాతీయ నగరాలను మించిన మహా నగరాన్ని నిర్మిస్తామన్నారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో 1,700 మురికి వాడలున్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఏ బస్తీలో నివసిస్తున్న వాళ్లకు ఆ బస్తీలోనే ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్‌నగర్ వాసులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం..’’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని వారసత్వ సంపద దెబ్బతినకుండా ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో వారసత్వ సంపదకు నష్టం కలుగకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు త్వరలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, అధికారులను త్వరలో ఇస్తాంబుల్‌కు పంపించనున్నట్లు సీఎం తెలిపారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించి.. ఇక్కడ ముస్లిం పేద విద్యార్థుల కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్‌ను శివారుకు తరలించి.. రేస్‌కోర్స్ స్థలంలో వంద ఎకరాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. పేకాట క్లబులు, జూదాలాడే రేస్‌కోర్స్‌లు మనకు అవసరమా..? అని వ్యాఖ్యానించారు.
 
  దమ్ముంటే రైతుల రుణాలు మాఫీ చెయ్యి..
 
 ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ సవాలు చేశారు. ‘‘టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇప్పటి కే రైతులకు సంబంధించిన రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశాం. అదే చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ. 1.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. వాటి అమలు సాధ్యం కాదని చెప్పిన ఇతర పార్టీల నేతలను దబాయించిండు. తీరా అధికారంలోకి వచ్చినంక వాటిని పట్టించుకోకుండ అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. చంద్రబాబుకు దమ్ముంటే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి చూపించాలె..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు పాలన వల్లే నేడు తెలంగాణ రైతులకు కష్టాలు వచ్చాయని... వారు అనుసరించిన తప్పుడు విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదన్నారు. తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ కష్టాలు తప్పవని ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెకు వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీరు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కర్నె ప్రభాకర్, సలీం, వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా?: - చంద్రబాబుపై తలసాని మండిపాటు
 
 ‘‘మేం ఎటో పారిపోతున్నట్లు మమ్ములను ఓ గదిలో బంధించి నీకు ఏం కావాలి? నీ కుటుంబానికి ఏం కావాలి? అంటూ బాబు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే బేరాలు ఆడుతున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా? నీకేమైనా సిగ్గుందా..?’’ అంటూ తలసాని శ్రీనివాస్‌యాదవ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాము యాచించే వాళ్లం కాదని, హైదరాబాద్‌ను శాసించే వాళ్లమని వ్యాఖ్యానించారు. తమ సత్తా ఏమిటో త్వరలోనే తెలుస్తుందని, వంద జన్మలెత్తినా తమలాంటి నేతలను తయారు చేయలేవని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లింది. బాబు కళ్లకు కాంట్రాక్టర్లు మినహా కార్యకర్తలెవరూ కనిపించడం లేదు. కొంతమంది చంద్రబాబు బంట్రోతులు బ్రోకర్లలా మాట్లాడుతున్నారు..’’ అని తలసాని విమర్శించారు. బతకడానికి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ప్రతి ఒక్కరికి టీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని చెప్పారు.
 
 తల్లిరుణం తీర్చుకునేందుకే..: తీగల
 
 తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామన్నారు.
 
 బంగారు తెలంగాణ కోసమే..: గంగాధర్‌గౌడ్
 
 చంద్రబాబు సహా కొంత మంది సీమాంధ్రులు ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక పోతున్నారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ చెప్పారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని పేర్కొన్నారు.