Friday, October 31, 2014

మరఠ్వాడా కీ షేర్నీ

మరఠ్వాడా కీ షేర్నీ
ముంబై: వేదికపైకి యువ ఎమ్మెల్యే, దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే  కుమార్తె పంకజ ముండే(35) ప్రమాణం చేసేందుకు వచ్చినప్పుడు స్టేడియం ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ‘కౌన్ ఆయా? మరాఠ్వాడా కీ షేర్నీ ఆయా(ఎవరొచ్చారు? మరఠ్వాడా సివంగి వచ్చారు)’ అనే నినాదాలతో హోరెత్తింది. ప్రమాణం చేస్తున్నప్పుడు ఆమె మెట్టింటి పేరైన పాల్వేని వదిలేసి ‘పంకజ గోపీనాథ్ ముండే’గానే తన పేరును పేర్కొన్నారు.

సినిమా రివ్యూ: కరెంట్ తీగ

సినిమా రివ్యూ: కరెంట్ తీగ
 నటీనటులు: 
 మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు.
 
 సంగీతం: అచ్చు
 ఫొటోగ్రఫి: సతీష్ ముత్యాల
 నిర్మాత: మంచు విష్ణు
 దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి
 
 ఆకట్టుకునే అంశాలు:
 కామెడీ
 మంచు మనోజ్ ఫెర్ఫార్మెన్స్
 రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లియోన్ గ్లామర్
 ఫైట్స్, ఫోటొగ్రఫి
 క్లైమాక్స్
 
 మైనస్ పాయింట్స్
 రొటిన్ కథ
 
పార్వతీపురంలో గ్రామపెద్ద శివరామరాజు(జగపతిబాబు)కు ముగ్గురు కూతుళ్లు. వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్). ఆ ఊర్లో   వీర్రాజు(సుప్రీత్) అనే వ్యక్తితో శివరామరాజుకు వైరం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు (మంచు మనోజ్) వీఐపీల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే రాజు, కవితలు ప్రేమించుకుంటాడు. రాజుతో ప్రేమను ఇష్టపడని కవిత తండ్రి శివరామరాజు.. తనకు నచ్చిన వ్యక్తితో కూతురు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.
 
దాంతో కవిత, రాజులు లేచిపోవాలని నిర్ణయించుకుని.. ఊర్లో నుంచి పారిపోవడానికి సిద్ధపడుతారు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న వాళ్లిద్దరూ తిరిగి శివరామరాజు దగ్గరకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన రాజు, కవితలను శివరామరాజు ఏంచేశాడు? వీర్రాజుతో శివరామరాజుకు మధ్య ఉన్న వైరం ఏంటి? ఏ కారణంతో రాజుతో కవిత ప్రేమను వ్యతిరేకించాడు? లేచిపోవాలనుకున్న రాజు, కవితలు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇక ఈ కథలో సన్నీ లియోన్, సంపూర్ణేష్ బాబుల పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ’కరెంట్ తీగ’.
 
 ఎప్పటిలాగే హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను వ్యతిరేకించడం లాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సమాజంలో ఆడపిల్లలు పుట్టడం నేరంగా చూడకూడదు అనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని అల్లిన కథలో రాజుగా మంచు మనోజ్.. ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ తో కలిసి రొమాన్స్‌ను పండించాడు. ఓ పాటను పాడటమే కాకుండా, క్యాస్టూమ్స్ డిజైన్, ఫైట్స్ విభాగాల్లో తన మార్కును చూపించాడు.  మరోసారి మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. గతంలో కంటే ఈ చిత్రంలో మనోజ్ కాస్త పుష్టిగా కనిపించాడు. ఈ విషయంలో మనోజ్ జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. 
 
 గ్లామర్‌కే పరిమితి కాకుండా.. నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది.  అతిధి పాత్రలో సన్నీలియోన్ టీచర్‌గా హాట్‌ హాట్‌గా కనిపించించింది. ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహన్ని కలిగించేలా ఉంది.
 
 లెజెండ్‌తో రూట్ మార్చిన జగపతిబాబు.. ఈచిత్రంలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను, కథకు వెన్నెముకగా నిలిచాడు. ఎప్పటిలాగే తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమ పాత్రల పరిధి మేరుకు పర్వాలేదనించారు. 
 
 సాంకేతిక విభాగం:
 ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పిల్లా ఓ పిల్లా, వరికుప్పల యాదగిరి ’పోతే పోని పోరా’, భాస్కర భట్ల ’ఎర్ర ఎర్ర చీర’, అనంత శ్రీరాం రాసిన పదహారేళ్లైనా పాటలు ఆలరించాయి. అచ్చు బ్యాక్ గ్రౌడ్ స్కోర్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే అదనంగా మరికొంత ఫీల్ తెరపై కనిపించేంది.  మంచు మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, ఫోటోగ్రఫి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. 
 
 దర్శకత్వం: 
 మినిమమ్ గ్యారెంటి అనే బ్రాండ్ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. తొలి భాగంలో కథనంలో వేగం మందగించనట్లు కనిపించినా.. సెకండాఫ్‌లో గన్ ఎపిసోడ్, జగపతిబాబు నిద్రలో నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే.. కథలో కొంత వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. 
 
ముగింపు:
కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ‘కరెంట్ తీగ’ బీ, సీ సెంటర్లోని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మనోజ్ కెరీర్‌లో భారీ విజయం చేరినట్టే.

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!
లండన్ :
ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే.. మధ్యలో నేనూ వస్తా అంటూ చిన్న పిల్లలు దూరడం సర్వసాధారణం. అయితే, న్యూకేజిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు లండన్ బార్ లో సెల్ఫీ తీసుకుంటే.. వాళ్ల అనుమతి తీసుకోకుండానే ఓ అతిథి వచ్చి ఆ ఫొటోలో దూరింది. ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ 'దెయ్యం' నిలబడినట్లుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఫొటో.. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) అనే ఇద్దరు కలిసి న్యూ కేజిల్ లో 'గరల్స్ నైట్'ను ఎంజాయ్ చేశారు.  ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకున్న తర్వాత ఈ ఫొటో తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్ చాట్ లో అప్ లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత
నంద్యాల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్ కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాటి మున్సిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. దాంతో నంద్యాల అంతా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను అడిగినా ఎలాంటి సమాధానం రావట్లేదు. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!

అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!
బరేలీ : ఉత్తరప్రదేశ్ లోని బరేలీ వాసులకు అనుకోని పార్టీ దక్కింది. బరేలి సమీపంలోని బడా బైపాస్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ప్రముఖ లిక్కర్ కంపెనీకి చెందిన 'స్ట్రాంగ్' బీరు తీసుకెళ్తున్న లారీ తిరగబడటంతో మొత్తం అందులో ఉన్న బీరు కార్టన్లన్నీ పడిపోయాయి. ఈనోటా, ఆ నోటా ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసింది.

వెంటనే అందరూ జెర్రీ క్యాన్లు, గ్లాసులు, మగ్గులు, జార్లు, చివరకు పాలిథిన్ కవర్లు కూడా పట్టుకుని చేతనైనంత బీరును ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరికొందరు ఔత్సాహికులు అక్కడికక్కడే పొట్టలో పట్టినంత ఎక్కించేశారు. విషయం చుట్టుపక్కల గ్రామస్థులకు కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా గిన్నెలు, చెంబులు పట్టుకుని వచ్చేశారు. దాంతో చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే బైపాస్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ కు, అతడి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లిద్దరినీ ముందు కాపాడి.. ఆ తర్వాత లారీలో ఉన్న మొత్తం సరుకంతటినీ ఖాళీ చేసేశారు. ఇళ్లలో ఉన్న సామాన్లన్నింటినీ తీసుకొచ్చి, వాటిలో నింపేసుకుని వెళ్లారు. కొంతమంది అయితే, బాగున్న సీసాల కార్టన్లను కార్లలో వేసుకుని కూడా వెళ్లిపోయారు. దారిలో వెళ్లేవాళ్లు కూడా ఆగి.. ఏంటా అని చూసి.. తాము కూడా ఓ చెయ్యేసి బీర్లు తెగ లాగించేశారు. లారీ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఓ సైకిల్ అడ్డం రావడంతో అదుపుతప్పి లారీ బోల్తాపడిందని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి చెప్పాడు. చివరకు సీబీగంజ్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య

చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ : చదువుపై అయిష్టత ఓ యువతి ప్రాణాలు తీసింది. తనకు చదువంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలోని శాంతాభవన్ క్యాంపస్ లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం కడప జిల్లా.

చదువుకోవడం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం

కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శనివారం కూడా ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. రామకుప్పం మండలం రామాపురం తండా సమీపంలో గజరాజులు ఘీంకారాలతో హోరెత్తిస్తున్నాయి. వీర్నమల ప్రాంతంలో పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో సమీప గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విద్యుత్ షాకుతో రామాపురం తండా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో గురువారం ఓ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన ఏనుగులు అక్కడే మకాం వేశాయి.  రాత్రంతా గుంపులోని మిగిలిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ అక్కడే ఉండిపోయాయి. ఎలాగైన కిందపడ్డ ఏనుగును తీసుకెళ్లాలని ప్రయత్నించాయి. మరోవైపు మృతి చెందిన ఏనుగును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.